Saturday, April 4, 2009

Natti kumar comments on allu aravind

మూడు లక్షలమంది సినిమా కార్మికులనే పట్టించుకోని వ్యక్తి, అంతకు నాలుగురెట్ల సంఖ్యలో ఉన్న అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? సినీ పరిశ్రమ స్లంపులో ఉన్నప్పుడు కార్మికుల వైపు కన్నెత్తి చూడని వ్యక్తి, పేద కార్మికులకు ఎడమచేత్తో ఎంగిలిమెతుకులు విదిలించని వ్యక్తి ఎంిపీగా ఎన్నికై ఎవరిని ఉద్ధరిస్తారు? చిరంజీవిపై ఉన్న అభిమానంతో రక్తదానంచేసి, మృతి చెందినవారి కుటుంబాలు రోడ్డుపాలైతే పట్టించుకోని వాళ్లు సామాజిక న్యాయం చేస్తారంటే నమ్మేదెవరు?' అని చిన్న నిర్మాతల సంఘం కన్వీనర్‌ నట్టి కుమార్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్రిస్టియన్‌ పోరాట సమితి అధ్యక్షుడుగా ఉన్న ఈయన చాలా ఏళ్ల క్రితం రాషా్టన్న్రి ఉర్రూతలూగించిన ముద్రగడ నేతృత్వంలోని కాపు పోరాటసమితికి కన్వీనర్‌గా వ్యవహరించారు.

రానున్న ఎన్నికల్లో అనకాపల్లి ప్రజలు స్థితప్రజ్ఞతతో వ్యవహరించి ఓటు వేయాలని, ముఖ్యంగా చిరు అభిమానులు తమకు అన్యాయం జరగడానికి కారకులెవరో గుర్తించి, బడుగుబలహీన వర్గాల కోసం కృషి చేస్తున్న వ్యక్తులను గెలిపించాలని నట్టికుమార్‌ కోరారు. శుక్రవారం ఆయన `సూర్య' ప్రధాన రాజకీయ ప్రతినిధితో మాట్లాడారు. ఆయన
ఏమన్నారంటే...

`వీళ్లు సొంత పరిశ్రమలోనే సామాజిక న్యాయాన్ని అమలు చేయలేదు. కానీ, పవన్‌కల్యాణ్‌, నాగబాబు సరైన విధానాలున్న వాళ్లు. సామాజిక న్యాయంచేసే శక్తి వాళ్లకే ఉంది. ఎప్పటికైనా పవన్‌ కల్యాణే పీఆర్పీ అధ్యక్షుడు. రేపటి ఎన్నికల్లో పీఆర్పీ ఓడిపోతే దానికి కారణం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ కాదు. కచ్చితంగా అల్లు అరవిందే' అని స్పష్టం చేశారు.

చిరు కుటుంబాన్ని అరవింద్‌ గుప్పిట్లో పెట్టుకున్నారు

ఫ్యాన్‌‌సకు ఎన్నికల్లో టిక్కెట్ల గురించి, చిరు కుటుంబంపై అల్లు అరవింద్‌ పెత్తనం గురించి చెబుతూ నట్టికుమార్‌- `ఈ ఎన్నికల్లో ఫ్యాన్‌‌సకు ఎన్ని టిక్కెట్లు ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా? ఉంటే అనకాపల్లిలో మీడియా ముందుకొచ్చి చెప్పే దమ్ముందా? సినిమాల్లో కాపు నిర్మాతకేమైనా చేశారా? నేనూ కాపునే! జూనియర్‌ ఎన్టీఆర్‌ తన నిర్మాత నష్టపోతే మళ్లీ సినిమాలిస్తున్నాడు. అంత పెద్ద మనసు వీళ్లకుందా? చిరంజీవి కేవలం ఒక బొమ్మ. ఆయనేం చేయాలో, ఏ సినిమాకు సైన్‌ చేయాలో, ఏ సినిమా చూడాలో కూడా చెప్పే అల్లు అరవింద్‌ చిరంజీవి కుటుంబాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. తన కొడుకు కోసం పవన్‌ను తొక్కిపెట్టారు' అని నట్టికుమార్‌ ఘాటుగా విమర్శించారు.

అనకాపల్లికి ఏం చేస్తారని అడిగా

`మా పరిశ్రమకు చెందిన అల్లు అరవింద్‌ అనకాపల్లి నుంచి ఎంపిగా పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆయనకు మద్దతునివ్వాలని కొందరు నా దగ్గరకొచ్చారు. అయితే, వాళ్లను నేను కొన్ని ప్రశ్నలడిగా. 3 లక్షల మంది ఉన్న మన పరిశ్రమ కార్మికులు, టెక్నీషియన్లకు ఎలాంటి సాయం చేయని వ్యక్తి అంతకు నాలుగురెట్ల జనాభా ఉన్న అనకాపల్లి ప్రజలకు ఏం చేయగలరని ప్రశ్నించా. ఆ కుటుంబం పెరిగింది అభిమానుల రక్తమాంసాలతో.

సొంత సినిమాకోసం టిక్కెట్ల రేట్లు పెంచి అభిమానుల జేబులు గుల్లచేసిన వాళ్లు కనీసం ఒక్క అభిమానికయినా ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చారా అని అడిగా. చిరంజీవి, అల్లు కోట్లు సంపాదించారు. గత 20 ఏళ్లలో రాష్ట్రంలో తుపాను, వరదలు వస్తే ఆ కుటుంబం నయాపైసా సాయం చేసిందా? తెలుగుప్రజలు కొన్న టిక్కెట్ల డబ్బుతో కోటీశ్వరులైన చిరంజీవి, అల్లు నయాపైసా ఇచ్చారా? సామాజిక న్యాయం గురించి చెబుతున్న ఈ పెద్దమనుషులు ఇప్పటివరకూ పరిశ్రమలోని బీసీ, ఎస్సీ, ఎస్టీలనెవరినైనా తమ గుమ్మంలోకి రానిచ్చారా అని అడిగా. పోనీ, మిమ్మల్నయినా రానిచ్చారా అని ప్రశ్నిస్తే ఎవరూ జవాబు చెప్పలేదు.

అల్లు అరవింద్‌ దెబ్బ తీశారు

అభిమానులను అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదించిన వాళ్లు అదే అభిమానులు తమకోసం చనిపోతే కనీస సాయం చేయడానికే మనసురాని వాళ్లు ఎంిపీగా గెలిచి ఏం ఉద్ధరిస్తారు? పవన్‌ కల్యాణ్‌, నాగబాబుకు నాయకత్వ లక్షణాలున్నా, వారిని అల్లు ఎదగనివ్వలేదు. సినిమాల్లో కూడా పవన్‌ను ఎదగనివ్వలేదు. గజిని సినిమా పవన్‌ చేస్తానన్నా ఆయనకివ్వలేదు. ఆయన వ్యక్తిగత వ్యవహారాన్ని రచ్చకెక్కించింది ఎవరో కూడా పరిశ్రమలో అందరికీ తెలుసు' అని నట్టికుమార్‌ వివరించారు.

అల్లును అడగండి

`అనకాపల్లి ప్రజలు, చిరంజీవి అభిమానులు అల్లును ఒకటే ప్రశ్న అడగాలి. మీరు గెలిస్తే హైదరాబాద్‌లోని ఏిసీ రూముల్లో ఉంటారా? ఇక్కడ ఉంటారా?-అని. అభిమానుల కష్టంతో సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకుని కోట్లు సంపాదించుకుని మాకేం చేశారో చెప్పమని నిలదీయండి. ఒక్క అభిమానికయినా సీటిచ్చారా అని ప్రశ్నించండి. చిరు కోసం ప్రాణాలర్పించిన అభిమానుల కుటుంబాలకు ఏం సాయం చేశారో చెప్పమనండి. చిరంజీవి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కూడబెట్టిన ఈయన ఏనాడైనా తన కులానికి గానీ, బీసీలకు గానీ ఏమైనా సాయం చేశారో చెప్పమనండి.

చిన్న నిర్మాతల పొట్టకొట్టారు

అల్లు పూర్తిగా బిజినెస్‌మేన్‌. థియేటర్ల లీజు వ్యవహారంలో చిన్న నిర్మాతల పొట్టగొట్టారు. మేమంతా నిరాహారదీక్ష చేస్తే ఒక రాజకీయపార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన కనీసం పలకరించలేదు. సొంత పరిశ్రమనే గౌరవించని వ్యక్తి, నియో జకవర్గ ప్రజలను ఏం గౌరవిస్తారు? ఇప్పటికయినా మించి పోయింది లేదు. చిరంజీవి ఆయనను పక్కకుపెట్టక పోతే పార్టీకి భవిష్యత్తు లేదు. పవన్‌ను ప్రోత్సహిస్తే యువతతో పాటు, కాపు వర్గం కూడా పీఆర్పీ వెంట ఉంటుంది. ఇప్పుడు అల్లు వల్ల పార్టీకి కాపులు కూడా దూరమవుతున్నారు. ఆయనను ఓడించేందుకు ఎక్కడెక్కడో ఉన్న కాపులంతా ఒక్కటవుతున్నారంటే పరిస్థితి గ్రహించాలి' అన్నారు నట్టికుమార్‌.

కాపులు చిరును, అల్లును చూసి ఓటేస్తారా?

`కాపులంతా చిరంజీవి, అల్లును చూసి పీఆర్పీకి ఓటు వేస్తారంటున్నారు. ఇది పసలేని వాదం. మేము ముద్రగడ నాయకత్వంలో కాపులకు రిజర్వేషన్ల గురించి పోరాడుతున్నప్పుడు చిరంజీవి, అల్లు మంచి స్థానంలో ఉన్నారు. అప్పుడు మద్దతు కూడా ప్రకటించలేదు. అది వదిలేయండి. కాపు నేత రంగా హత్యను వీళ్లిద్దరూ కనీసం ఖండించలేదు. వారి కుటుంబాన్ని పరామర్శించలేదు. మరి కాపులు వీళ్లకు ఎలా మద్దతిస్తారు. నేను కొద్దినెలల క్రితం పీఆర్పీ గాలి వీస్తోందని మా వారికి చెప్పా. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు ఎన్నిసీట్లు వస్తాయన్న అనుమానం మొదలయింది. ఇదంతా స్వయంకృతమే ' అన్నారాయన.

ఆరోజేం జరిగిందంటే...

`మేమంతా ఓసారి సారథి స్టుడియోలో ముఠామేస్త్రీ షూటింగులో ఉన్నాం. అప్పుడు చిరంజీవి తాను ఇక్కడ షూటింగ్‌ చేయనని, చెనై్నలో మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. దీనికి ఆ సమయంలో ఆ సినిమాలో నటిస్తున్న శ్రీహరి, నిర్మాత కె.సి. శేఖర్‌బాబు సాక్ష్యం. చివరకు వీళ్ల ఇన్‌కంటాక్‌‌స లెక్కలు కూడా చెనై్నలోనే ఉన్నాయి. అంటే వీళ్లకు రాష్ట్రంపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ మంచి మనసు

తమవల్ల నష్టపోయిన నిర్మాతలకు చిన్నవాడైనా జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలిస్తున్నాడు. వాళ్లకేమైనా సమస్యలొస్తే దగ్గరుండి మరీ సినిమా రిలీజ్‌ చేయిస్తున్నాడు. వీళ్లకు ఆ హృదయం ఏదీ? ముఖ్యమంత్రులే చిరంజీవి కోసం ఎదురుచూసే స్థాయికి తీసుకువెళ్లిన అభిమానులకు అప్పుడే ఏమీ చేయలేని చిరంజీవి, ముఖ్యమంత్రయితే ఏదో చేస్తారని భావించడం అవివేకమే.

ఇప్పుడైనా కళ్లు తెరవాలి

చిరంజీవి సోదరులైన కల్యాణ్‌, నాగబాబు, వారి కుటుంబసభ్యులతో పాటు, అభిమానులను ఒకటే కోరుతున్నా. మీరంతా ఇప్పటికయినా కళ్లు తెరవండి. చిరు పక్కదారి పట్టడానికి కారకులను పక్కకుపెట్టకపోతే, ఆ తర్వాత ఎంత బాధపడ్డా ఫలితం లేదు. ఇప్పటికే సినిమాల్లో డిస్ట్రిబ్యూషన్ల మాదిరిగా రాజకీయాల్లోనూ టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలతో పీఆర్పీ భ్రష్టుపట్టింది. అటు అభిమానులు, ఇటు కాపు వర్గం కూడా దూరమవుతున్నారు. చివరకు కాపు ఉద్యమాలు నడిపిన సీనియర్లు కూడా పక్కదారిపడుతున్న చిరంజీవిని హెచ్చరిస్తున్నారు. ఎవరినైతే చూసి బలమని భావిస్తున్నారో ఆ బలమే బలహీనమయి, తిరుగుబాటుచేస్తోంది. కేవలం డబ్బుకోసమే రాజకీయాల్లో కి వచ్చామకుంటే సినిమాల మాదిరిగానే చిరంజీవి బొమ్మను పెట్టుకుని బిజినెస్‌ చేసుకోండి. లేకపోతే పీఆర్పీని పవన్‌ కల్యాణ్‌కు అప్పగించండి' అని నట్టికుమార్‌ విజ్ఞప్తి చేశారు.

Media creates tension in Prajarajyam

మాజీ మంత్రి, ప్రజారాజ్యం పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కోట గిరి విద్యాధరరావు అభ్యర్థుల ఎంపిక పట్ల అసం తృప్తితో పార్టీకి రాజీనామా చేసినట్లు, ఏలూరులో రహస్య సమావేశం నిర్వహించినట్లు వదంతులు వచ్చాయి. ఇదే విషయం శుక్రవారం పాలకొల్లు విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న చిరంజీవిని ప్రశ్నించగా ఆయన ఒక్కసారిగా కంగుతిన్నారు. కొద్ది సేపు షాక్‌కు గురైన ఆయన `అది ఏమిలేదే... మధ్యాహ్నం వరకు నా దగ్గరే ఉన్నారు. నా నామినేషన్‌ పత్రాల పై సంతకం పెట్టడానికి ఆయన పెన్‌ (కలం) కూడా ఇచ్చారు. శనివారం ఉంగుటూరులో తన నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటానని చెప్పి వెళ్ళారు. కానీ మీరు చెబుతున్నది ఆశ్చర్యంగా ఉంది' అని అన్నారు. పక్కనే ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెంటనే ప్రచార వాహనంలోకి వెళ్ళి కోటగిరితో ఫోన్‌లో మాట్లాడి వెంటనే మీడియా సమావేశంలో ఉన్న చిరంజీవితో మాట్లాడాలని చెప్పారు.

చిరంజీవి మీడియా సమావేశాన్ని ముగించి ప్రచార వాహనంలోకి వెళ్ళి, ఒక్క క్షణంలోనే బయటకు వచ్చి `ప్రెస్‌ ఫ్రెండ్‌‌స..... ప్లీజ్‌ వెయిట్‌' అనుకుంటూ బస్సు లోంచి సెల్‌ఫోన్‌తో వచ్చి కోటగిరి విద్యాధరరావు తో పాత్రికేయుల, ఎలక్ట్రానిక్‌ మీడియా ఛానల్‌‌స విలేకర్ల సమక్షంలో మాట్లాడారు. `కోటగిరి విద్యాధ రరావు ప్రజారాజ్యం పార్టీకి మూలస్ధంభమని, అటువంటి ఆయన రాజీనామా చేశారని వదంతు లు రావడం ఏమిటని, ఇదిగో లైన్‌లో ఉన్నారు. విద్యాధరరావుగారు మాట్లాడతారు వినండి' అని చిరంజీవి అన్నారు. ఫోన్‌లో విద్యాధరరావు మాట్లా డుతూ `ప్రజారాజ్యం పార్టీ నాదని, నేను రాజీనా మా చేయడం ఏమిటని, ఇదంతా ఎవరో సృష్టించా రని, నమ్మవద్దని' అన్నారు. చిరంజీవి పదేపదే కోటగిరి ఈ పార్టీకి మూలస్తంభమని, సీట్ల పంపిణీలో ఆయనకు అసంతృప్తి ఏమిలేదని చెప్పారు.

పీఆర్పీలో చేరిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌


పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం శాసన సభ్యులు గ్రంథి శ్రీనివాస్‌ శుక్రవారం పాలకొల్లులో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమక్షంలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ మరోసారి మొండి చేయి చూపి టిక్కెట్‌ ఇవ్వని కారణంగా ఇటీవలే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. అందరూ ఊహించినట్లుగానే ఆయన ప్రజారాజ్యంలో చేరారు. కాగా ఆయన భీమవరం నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి ప్రజారాజ్యం తరపున నామినేషన్‌ కూడా దాఖలు చేశారు. ఆయనను గ్రంధి వెంకటరత్నం బలపరిచారు.

ticket aspirants shows anguish on Prajarajyam

పార్టీ పుట్టి నవ మాసాలైనా నిండలేదు. పోలింగ్‌ సింబల్‌ వచ్చి నెలైనా గడవలేదు. ప్రజారాజ్యం పార్టీ కోట అప్పుడే బీటలు వారుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికల సమరాంగణానికి సిద్ధం చేసుకోవాల్సిన తరుణంలోనే సొంత సేనల నుంచి తిరుగుబాట్లతో ఆపార్టీ కుదేలవుతోంది. పార్టీ కార్యవర్గంలో ఉన్న అగ్రనేతల్లో లుకలుకలు బయటపడుతున్నాయి. శాసనసభ, లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పాతర వేశారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అగ్రనేతలు పార్టీ వైపు కన్నెత్తయినా చూడకుండా ముఖం చాటేస్తు న్నారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కొనేందుకు ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి తాను ఎంచుకున్న వ్యూహం తనకే బెడిసి కొడుతోంది. నామినేషన్ల పర్వానికి కొన్ని గంటలే గడువు ఉండగా, మరో వైపు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ నేత నుండి పుట్టుకొస్తున్న నిరసన జ్వాలలతో పార్టీ అధిష్ఠానంకు చెమటలు పడుతున్నాయి.
పార్టీ జెండా భుజాల కెత్తుకుని నెలల తరబడి మోసిన వారికి టిక్కెట్లు దక్కక పోగా కొద్ది గంటల్లోనే ప్లేటు ఫిరాయించి పార్టీ గుమ్మంలోకి అడుగు పెట్టిపెట్టకముందే పాతవారిని పక్కన పెట్టి కొత్త వారికి అగ్రతాంబూలం ఇవ్వడంతో కార్యకర్తలు ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. పార్టీ కోసం తన వృత్తిని సైతం త్యాగం చేసి పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర వహించిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సమ రంను పక్కన పెట్టడంతో ఆయన కలత చెందారు. పార్టీ కోసం పని చేసిన వారి కంటే నిన్న మొన్న వచ్చిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, లోక్‌సభ, శాసనసభ స్థానాల్లో లోఫర్లకు, డాఫర్లకు టిక్కెట్లు ఇచ్చారంటూ ఆయన మండిపడుతు న్నారు. పార్టీ అధికారికి కార్యక్రమాలన్నింటినీ భుజాలకెత్తుకుని తన వాగ్ధాటితో ఇతర పార్టీలను ముచ్చెమటలు పట్టిస్తూ వచ్చిన పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సైతం అలక బూనారు.
టిక్కెట్టు ఆశించి భంగపడ్డ పద్మ పిఆర్‌పికి రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పార్టీ ప్రారంభంలోనే తెలుగు దేశంను వీడి ప్రజారాజ్యంలో చేరిన కోటగిరి విద్యాధరరావు సైతం మనస్థా పానికి గురయినట్లు సమాచారం. తాను కోరుకున్న ఉంగుటూరు, పోలర వంతోపాటు దెందులూరు, చింతలపూడి, నిడదివోలు టిక్కెట్లను తన అనుచ …రులకు ఇప్పించుకోవడంలో విఫలమైన కోటగిరి పార్టీకి రాజీనామా చేసే యోచ నలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజారాజ్యంలో మహిళారాజ్యం అధ్యక్ష బాధ్యతను నెత్తిన మోస్తూ పార్టీపై ఈగ వాలకుండా తన వాగ్ధాటితో కాపాడు కుంటూ వచ్చిన శోభారాణి సైతం అలకబూనారు. పార్టీలో ఇప్పటికే ఆమెను కరివేపాకులా వాడుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గన్నవరం టిక్కెట్టుపై తన ఆశలు ఫలించకపోవడంతో కారెం శివాజీ కూడా మనస్థాపం చెందినట్లు సమాచారం.

పార్టీకి గుర్తుగా రైలుఇంజన్‌ను తనే సాధించి పెట్టినట్లు గా ప్రచారం చేసుకుంటున్న చనుమోలు రాజీవ్‌, ఆయన భార్య లక్ష్మికి ఎంపి, టిక్కెట్లు కట్టబెట్టడం పట్ల పార్టీ వర్గాల్లోనే తీవ్రమైన అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ఐఎఎస్‌ అధికార హోదాను సైతం తృణప్రాయంగా వదిలేసి పార్టీ సేవలకే ఉపయోగపడుతూ వచ్చిన కెఎస్‌ఆర్‌మూర్తి తొలి నుంచి అమలాపురం పార్ల మెంటు స్థానంపై ఆశలు పెంచుకుంటూ వచ్చారు. అయితే అక్కడ కెఎస్‌ఆర్‌ మూర్తిని కాదని ప్రమీలారాణికి ప్రాధాన్యత నివ్వడంతో ఆయనకూడా అసం తృప్తితో ఉన్నారు. అనకాపల్లి టిక్కెట్టుపై ఆశలు పెట్టుకున్న మరో ఐఎఎస్‌ అధికారి కెవి.రావుకు కూడా మొండిచెయ్యే చూపారు. ప్రజారాజ్యంపార్టీకి తన భవనాన్ని కార్యాలయం కింద నజరానాగా ఇచ్చిన తోట చంద్రశేఖర్‌కు గుంటూరు ఎంపి టిక్కెట్టు ఇవ్వడం పట్ల కూడా అసమ్మతి సెగ రగులుతోంది.

అగ్రనేతల్లో లుకలుకలు

మరో వైపు పార్టీ అగ్రనేతల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే డాక్టర్‌ మిత్రాకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పవన్‌కళ్యాన్‌, చిరంజీ విలతో మిత్రా మధ్య మాటలు కరువైనట్లు సమాచారం. పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ పరకాల ప్రభాకర్‌ కూడా అధిష్టానం పట్ల కినుక వహించారు. పార్టీ అగ్రనేతలు శివశంకర్‌, చేగొండి హరిరామజోగయ్య సైతం పార్టీ వ్యవహారాల పట్ల అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఇప్పటికే పార్టీ కోసం ఎన్నో వ్యయ ప్రయా సలకోర్చిన గొట్టిముక్కల పద్మారావు, దిలీప్‌ వంటి వారెంతో మంది అధిష్టానంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చిరంజీవి అభిమానులు కూడా తమ ఫ్యాన్‌‌సకు ఎక్కడా స్థానం కల్పించకపోవడంతో రగిలిపోతున్నారు. చిరంజీవి ఫ్యాన్‌‌స రాష్ర్త అధ్యక్షులు చెనమలశెట్టి వెంకటేశ్వర్లు 17 జిల్లాల ఫ్యాన్‌‌సతో శుక్రవారం నాడు సమావేశమై పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు చేశారు. రెండో విడత ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లో ఫ్యాన్‌‌స చేత నామినేషన్లు వేయించనున్నట్లు వెల్లడించారు.

``మాదిగలు ఎక్కువగా వున్న వేమూరులో `కత్తి'కు టిక్కెట్‌ ఎలా ఇస్తారు? ఏ సామాజికన్యాయం ప్రకారం టిక్కెట్లిస్తున్నారు''

- శోభారాణి


``కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేకుండా పోయింది. టిక్కెట్ల పంపిణీలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి''

-వాసిరెడ్డి పద్మ


``పార్టీ ఆవిర్భవించిన నాటినుంచి అహర్నిశలు శ్రమించిన వారిని కాదని లోఫర్లకు, డాఫర్లకు టిక్కెట్లు ఇవ్వడం దారుణం''

-డాక్టర్‌ సమరం

Pawan speaks about tickets

పార్టీ టిక్కెట్లు అమ్ముకోవాల్సిన అవసరం తమకు లేదని ప్రముఖ సినీ నటుడు, యువరాజ్యం అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. విశాఖపట్నంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిక్కెట్‌ దక్కని వారంతా ప్రజారాజ్యంపై దుమ్మెత్తిపోస్తూ టిక్కెట్లు అమ్ముకుంటున్నారని చేస్తున్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించారు. పార్టీలో అందరికీ టిక్కెట్లు ఇవ్వడం ఎవరికైనా సాధ్యం కాదన్నారు. ఆయా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, గెలుపు అవకాశాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పదవుల కోసం కాకుండా సేవ కోసమే ఎవరైనా రాజకీయా లలోకి రావాలని ఆయన సూచించారు

Vasi reddy padhma stays with Prajarajyam

ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అలకపాన్పు దిగారు. కృష్టాజిల్లా నందిగామ ఎమ్మెల్యే టికెట్‌ను తన భర్త వెస్లీకి కేటాయించనందుకు పార్టీ అధిష్ఠానం వైఖరిపట్ల అసంతృప్తి చెందారు. ఒక దశలో పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే శనివారం పద్మ మీడియాతో మాట్లాడారు... ఎట్టి పరిస్థితుల్లోను ప్రజారాజ్యం పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను ఆవేదన మాత్రమే వ్యక్తం చేశానన్నారు. పార్టీ తరుపున ప్రచారం చేస్తానని పద్మ తేల్చిచెప్పారు.

Chiru files nomination at thirupathi along with Charan

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ సందర్భంగా పీఆర్పీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆర్డీవో ఆఫీస్‌ ముందు పీఆర్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతకు ముందు చిరు బీపారంను తనయుడు రామ్‌చరణ్‌ తిరుమలలో స్వామివారి పాదలవద్ద ఉంచి తీసుకువచ్చారు. చిరంజీవి కాన్వాయిలో మీడియా వాహనం అదుపుతప్పింది. అయితే మీడియా ప్రతినిధులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు

Chepal thrown on Balakrishna at pulivedilla

సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి సొంత నియోజకవర్గంలో టీడీపీ నేత, సినీనటుడు బాలకృష్ణ వాహనంపై గుర్తు తెలియన ఇవ్యక్తులు చెప్పులు విసిరారు. టీడీపీ నేత సతీష్‌ విజ్ఞప్తి మేరకు పులివెందులలో రోడ్‌షో నిర్విహంచేందుకు బాలకృష్ణ ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. అయితే బాలకృష్ణకు ఇచ్చిన సమయం ముగిసిందని పోలీసులు చెప్పిన వారి మాట వినకుండా ఆయన రోడ్‌షో కొనసాగించారు. ఈ సమయంలో జనం మధ్య నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు 7-8 చెప్పులు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

PRP party office burnt in krishna district

కృష్ణ జిల్లాలోని జగ్గయపేట పీఆర్‌పీ కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులుకు టికెట్టు ఇవ్వకపోవడంతో ఆగ్రహం చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడ్డారు. వైఎస్‌ సమక్షంలో 8వేల మంది కార్యకర్తలతో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.